రామకీర్తన

రచన - తాడిగడప శ్యామలరావు  



అదే పనిగ రామరసాయనము గ్రోలరే ప్ర
హ్లదనారదాదుల వలె యాడి పాడరే

పామరులను ఋషుల జేయు రామమంత్రము  సీ
తామహాసాధ్వి మదిని దలచు మంత్రము
కామక్రోధసర్పములను కట్టు మంత్రము  మీ
కామిత మగు మోక్ష మిచ్చి కాచు మంత్రము
రామనామరసాయనము తాము గ్రోలరే
రామమంత్రజపము చేసి రాణకెక్కరే             ॥అదే పనిగ॥

సదాముదావహము రామచంద్ర ధ్యానము  సం
పదలు విరుగకాయు  పాదు రామధ్యానము 
సదాసదాశివుడు ప్రీతి సలుపు రామధ్యానము  ఆ
పదల నుండి కాచు నట్టి భవ్యధ్యానము
రామనామరసాయనము తాముగ్రోలరే
రామధ్యానరక్తు లగుచు రాణకెక్కరే               ॥అదే పనిగ॥

విమలవేదాంతవేద్య రామతత్త్వము చి
త్తమున ప్రకాశింప జేయు విమలౌషధము
కుమతుల కిది దొరుక దండి కోరి సుజనులు ని
త్యమును గ్రోలు చుండు నట్టి యమృతౌషధము
రామనామరసాయనము తాము గ్రోలరే
రామతత్త్వ మెరిగి మీరు రాణకెక్కరే                ॥అదే పనిగ॥



*****
ఈ సంచికలోని ఇతర రచనలు 

1 comment:

  1. సుజనుల ఆలోచన 'సృజన' కు స్వాగతం !

    తాడి ని దన్నే తలపు !
    గడప గడపకూ వి(క)నిపించేలా....
    శ్యామలరావు రామభజన !!

    రామకీర్తన శ్రవణీయం
    రామభజన కమనీయం....
    అదే అదేపనిగ మన శ్యామలీయం !!

    ReplyDelete